ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బెంగళూరు బాలికను సహజీవనం చేద్దామంటూ నమ్మించి హైదరాబాద్‌కు రప్పించేందుకు ఏర్పాట్లన్నీ చేశాడు. చివర్లో ఆమె తండ్రికి తెలియడంతో వాడి బండారం బయటపడింది.
సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన బాలికను నమ్మించి సహజీవనానికి రెడీ అయిన హైదరాబాద్ యువకుడి ప్రయత్నం ఆఖరి నిమిషంలో బెడిచికొట్టింది. హైదరాబాద్‌లోని తన వద్దకు వచ్చేయాలంటూ ఆమె విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ పంపాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను హ్యాక్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆఖరి నిమిషంలో విమానాశ్రయంలో తన కూతురిని అడ్డగించి యువకుడిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్ లేఔట్ ప్రాంతానికి చెందిన బాలిక ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడంతో తరుచూ సోషల్‌మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. రోజూ ఛాటింగ్ చేసుకుంటూ ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో ఆమె తన వ్యక్తిగత చిత్రాలు కూడా అతడికి పంపించింది.
బాలిక పూర్తిగా తన మాయలో పడిందని నిర్ధారించుకున్న విశాల్ సహజీవనం చేద్దామంటూ ఆమెను ఒప్పించాడు. హైదరాబాద్ వచ్చేస్తే ఇద్దరం కలిసి ఉందామని నమ్మబలికాడు. ఆమెను మేజర్‌గా చూపించేందుకు ఫేక్ సర్టిఫికెట్లు తయారుచేశాడు. ఈ నెల 8వ తేదీన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ప్లైట్ టిక్కెట్లు పంపించాడు. అతడు చెప్పినట్లే ఆ రోజు బాలిక మ్యూజిక్ క్లాస్‌కి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చేసింది. క్యాబ్ ఎక్కి నేరుగా కెంపెగౌడ ఎయిర్‌పోర్టు చేరుకుంది.
కూతురు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు మ్యూజిక్ టీచర్‌కు ఫోన్ చేయగా తమ వద్దకు రాలేదని చెప్పారు. స్నేహితుల ఇంటికి ఫోన్ చేసినా అదే సమాధానం వచ్చింది. కొద్దిరోజులుగా కూతురు ప్రవర్తనపై అనుమానపడుతూ వస్తున్న తండ్రి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి చూడగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విశాల్‌తో జరిపిన చాటింగ్, ఫోటోలు షేర్ చేసుకోవడం, విమాన టిక్కెట్లు పంపడం అన్ని విషయాలు తెలుసుకున్న తండ్రి వెంటనే ఎయిర్‌పోర్టు వెళ్లి చూడగా హైదరాబాద్ ఫ్లైట్ కోసం బాలిక వేచి చూస్తూ కనిపించింది. ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిన తండ్రి 17వ తేదీన బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు విశాల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Post a Comment