Skip to main content

పొరపాటు ఖరీదు రూ.12 కోట్లు.. ఒక కారు బదులు 28 కార్లు ఆర్డర్, చివరికి..

ఆ ఆన్‌లైన్ సైటులో ఒక కారును ఆర్డర్‌ చేస్తే 28 కార్లకు ఆర్డర్ సరిపడా రూ.12 కోట్లు మాయమయ్యాయి. చివరికి ఏమైందంటే.. న్‌లైన్ షాపింగ్ అంటే.. అన్నీ సరిగ్గా చూసుకోవాలి. లేకపోతే.. ఇలాగే అడ్డంగా ‘బుక్కై’పోతాం. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా? లాక్‌డౌన్ కావడంతో జర్మీనికి చెందిన తండ్రీ కొడుకులు ఆన్‌లైన్‌లోనే తెస్లా లగ్జరీ కారును కొనాలని అనుకున్నారు. బుకింగైతే ఒక కారుకే చేసుకున్నారు. అయితే, అమౌంట్ పే చేసేప్పుడు మరి ఏం తప్పు చేశారో ఏమో.. ఏకంగా 28 కార్లు బుక్కైపోయాయి. ఈ విషయం గమనించని వారు పేమెంట్ మొత్తం చెల్లించేశారు. దీంతో వారి అకౌంట్‌లో ఉన్న 1.4 మిలియన్ యూరోలు (సుమారు రూ.12 కోట్లు) ఖాళీ అయిపోయాయి. ఆ డబ్బు మొత్తం 28 టెస్లా మోడల్ 3S కార్ల కొనుగోలు చేసేందుకు చెల్లించినట్లు మెసేజ్ వచ్చింది. అంతే.. ఆ తండ్రీ కొడుకులకు గుండె ఆగినంత పనైంది.
ఈ విషయాన్ని వారు రెడిట్ అనే బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. తమ అకౌంట్‌లో రూ.12 కోట్లు ఖాళీ అయ్యేయనే సంగతి తెలియగానే వారు ఆ కంపెనీకి కాల్ చేశారు. తాము బుక్ చేసింది ఒక కారేనని, బిల్లులో 28 కార్లకు రూ.12 కోట్లు చెల్లించినట్లు చూపిస్తోందని చెప్పారు. దీంతో ఆ కంపెనీవారు తమ ఆన్‌లైన్ సైటులో తప్పిదం జరిగి ఉంటుందని భావించి.. వారు చెల్లించిన మొత్తాన్ని ఎలాంటి కోతలు చేయకుండా తిరిగి ఇచ్చేశారు. దీంతో ఆ తండ్రీ కొడుకులకు ప్రాణం తిరిగొచ్చినట్లయ్యింది.కంపెనీ వారు ముందు చేసిన ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేశారు. తాజాగా మరోసారి ఆర్డర్ చేయాలని వారిని కోరారు. దీంతో వారు రెండోసారి ఒళ్లు దగ్గర పెట్టుకుని కారును ఆర్డర్ చేశారు. చూశారుగా, ఆన్‌లైన్‌లో ఏమైనా వస్తువులు కొనేప్పుడు మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఆ కంపెనీవాళ్లు మంచోళ్లు కాబట్టి.. డబ్బుకు ఆశపడకుండా రిఫండ్ మొత్తం తిరిగిచ్చారు. అన్ని సంస్థలు, వ్యాపారులు వారిలాగే నిజాయతీగా ఉంటారని మాత్రం భావించద్దు. జాగ్రత్త!

Comments