విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటన మరువక ముందే పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అర్థరాత్రి రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న షిఫ్ట్ ఇన్‌చార్జ్ రావి నరేంద్ర(33)), కెమిస్ట్ గౌరీశంకర్(26) మృతిచెందారు. చంద్రశేఖర్, ఆనందబాబు, జానకీరావు, సూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధితులను చికిత్స నిమిత్తం గాజువాక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ లోపలికి మీడియాను అనుమతించడంలేదు. కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షల నష్ట పరిహారం చెల్లించడంతో పాటు కంపెనీ యజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Comments
Post a Comment